దేశ భాష‌లందు తెలుగు LESS?
Talk
2.0 hrs
December 22, 2016 7:30 pm Thursday

దేశ భాష‌లందు తెలుగు లెస్

"దేశ భాష‌లందు తెలుగు లెస్స" అన్నారు. కానీ ఇప్పుడ‌ది "దేశ భాష‌లందు తెలుగు లెస్‌"గా మారింది. ఇంగ్లీషు వ్యామోహం వల్ల క్ర‌మంగా తెలుగు భాష ప్రాధాన్య‌త‌ను కోల్పోతోంది. ఫ‌లితంగా తెలుగు భాష మ‌నుగ‌డే ప్రశ్నార్థ‌కంగా మారుతోంది. ప్రైవేటు పాఠశాలలలో ప్రాథమిక స్థాయి నుండే ఇంగ్లీషు బోధనా మాధ్యమంగా బ‌ల‌ప‌డ‌డం, ప్రభుత్వ కార్యకలాపాల్లో సైతం తెలుగుకు ప్రాధాన్య‌త త‌గ్గ‌డం ఇందుకు కార‌ణంగా చెప్పుకోవ‌చ్చు.

రెండు రాష్ట్రాల్లో తెలుగు భాష చ‌లామ‌ణిలో ఉన్న‌ప్ప‌టికీ ప్ర‌ధాన న‌గ‌రాల్లోని మెజార్టీ ప్ర‌జ‌లు తెలుగు భాష వాడ‌కాన్ని విస్మ‌రిస్తున్నారు. ఏ భాషనైతే ఆ ప్రాంతంలోని ముప్పై శాతం మంది ప్రజలురో అది మృత భాషగా మారినట్లే. ఇప్పుడు తెలుగు కూడా ఆ జాబితాలో ఉందన్నది యునెస్కో నివేదిక చెబుతోంది. తెలుగుభాషకు కొత్త జీవం ఇవ్వడానికి వ్య‌క్తులు, సంస్థ‌లు అర‌కొర ప్ర‌య‌త్నాలు చేసిన ప్ర‌భుత్వాల నుంచి చెప్పుకోద‌గ్గ కృషి జ‌ర‌గ‌క‌పోవ‌డం విషాదం. అధికార భాషా సంఘాలు, చ‌ట్టాలు ఉన్నా చిత్త‌శుద్ధి లోపించ‌డం వ‌ల్లే తెలుగు ప‌ట్ల నిర్ల‌క్ష్యం కొన‌సాగుతోంది.

పాలనా భాషగా, బోధనా భాషగా, వ్యవహార భాషగా అమలైనప్పుడే ఏ భాషక‌కైనా మనుగడ ఉంటుంది. ఈ మూడింటిలోనూ తెలుగు భాష నిరాదరణకు గురవుతోంది. ప్రపంచీకరణ అన్ని రంగాలపై చేస్తున్న దాడి ఇందుకు కార‌ణం. సామాజిక జీవనంలో అతి కీలకమైన భాషపై కూడా ఆ ప్ర‌భావం ఉంద‌నే చెప్పాలి. ప్రైవేటు పాఠశాలల్లో తెలుగు మాట్లాడితే విద్యార్థుల‌కు శిక్ష విధిస్తున్నారు. పరభాష వ్యామోహంలో నేడు తెలుగును ప్రజలకు దూరం చేస్తున్నారు. ఈ వైఖ‌రి మారాలంటే.. ఇప్ప‌టికైనా తెలుగు భాష‌ను అంద‌రికీ ఉప‌యోగ‌ప‌డే మాద్య‌మంగా మార్చాలి. పాలనా భాషగా, బోధనా భాషగా, వ్యవహార భాషగా తెలుగును ఖ‌చ్చితంగా అమ‌లు చేయాలి.

కాళోజీ అన్న‌ట్లు... ‘నీ భాషల్నే నీ బతుకున్నది; నీ యాసల్నే నీ సంస్కృతున్నది. భాష రెండు తీర్లు - ఒకటి బడిపలుకుల భాష, రెండోది పలుకుబడుల భాష. మ‌న‌కు పలుకుబడుల భాష గావాలె,’ ఆ దిశ‌లో మ‌నంద‌రం ఆలోచించాల్సిన సంద‌ర్భం ఇది.

ఈ నేప‌థ్యంలో... తెలుగు భాష నిరాద‌ణ - తెలుగు భాష ప‌రిర‌క్ష‌ణ‌కు చేప‌ట్టాల్సిన క‌ర్త‌వ్యాల‌ను గురించి చర్చించేందుకు లామ‌కాన్ "దేశ‌భాష‌లందు తెలుగు లెస్" కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తోంది. ఈ కార్య‌క్ర‌మంలో డాక్ట‌ర్ మంజుల‌త (తెలుగు విశ్వ‌విద్యాల‌యం), నాగ‌మ‌ల్లేశ్వ‌ర రావు (ఆల్ ఇండియా రేడియో), జి ఉమామహేశ్వర రావు (హైదరాబాద్ విశ్వవిద్యాలయం)...... మాట్లాడుతారు.

Organizer
Lamakaan Programming Team
Lamakaan Programming Team curates and brings to you the best of art,cinema,music etc.