Patriotism, Nationalism & relevance of Bhagat Singh a talk by Prof C Kaseem
దేశభక్తి - జాతీయవాదం - భగత్‌సింగ్ ప్రాసంగికత : ప‌్రొఫెసర్ సి. కాశీం
వలసాధిపత్యాన్ని దిక్కరించి తిరుగుభాటు జెండానెగరేసిన విప్లవ వీరుడు భగత్ సింగ్. "ఇంక్విలాబ్" నినాదమిచ్చి సామ్రాజ్యవాద వ్యతిరేకపోరాటాన్ని మండించాడు. పార్లమెంటులో పొగబాంబును వేసి స్వేచ్ఛా గీతాన్నాలపించిన భగత్‌సింగ్, రాజ్‌గుర్, సుఖ్‌దేవ్‌లను బ్రిటీష్ ప్రభుత్వం 1931 మార్చి 23న ఉరితీసింది. వలస పాలకులకు తీసిపోని ప్రజా వ్యతిరేక పాలన నేటికీ కొనసాగుతుండడం ఇవాల్టి విషాదం. అమెరికా సామ్రాజ్యవాదంతో జతకూడిన హిందూ మతోన్మాదం ఫాసిస్టు చర్యలకు పాల్పడుతోంది.
హిందూ జాతీయవాదాన్ని భారత జాతివాదంగా భిన్న విశ్వాసాల ప్రజలపై రుద్దడానికి ప్రయత్నం చేస్తోంది బీజేపీ. ఇది హిందువుల దేశమని, ఇక్కడ హిందువులే ఉండాలని మతోన్మాద సంస్థలు దాడులకు పాల్పడుతున్నాయి. తమకు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్లందరినీ దేశద్రోహులుగా, జాతి వ్యతిరేకులుగా చిత్రీకరిస్తున్నాయి. దేశభక్తి - జాతీయవాదం పేరుతో ఫాసిస్టు చర్యలకు పాల్పడుతున్నాయి. అది గుజరాత్ నుంచి ముజఫర్ నగర్‌ల మీదుగా దేశరాజధానికి చేరింది. రేహిత్ వేములను దేశద్రోహిగా ముద్రవేసి హత్యచేసింది. ఉమర్ ఖాలిద్ ను, కన్హయ్య కుమార్‌లను జాతివ్యతిరేకులంటూ వెంటాడుతోంది. ఆదివాసీలను ఎన్‌కౌంటర్ పేరుతో మట్టుబెడుతోంది. హక్కులడిగిన వారిని జైళ్లలో నిర్భందిస్తోంది. ముస్లిం అయితే చాలు టెర్రరిస్టని, ఆదివాసీ అయితే చాలు మావోయిస్టని ముద్రవేస్తోంది. మరోవైపు దేశ ప్రజల విముక్తికి విప్లవమొక్కటే మార్గమని నమ్మిన భగత్‌సింగ్‌ని సైతం తమ దేశభక్తి చట్రంలో బంధించేందుకు ప్రయత్నిస్తోంది బీజేపి. తనను తాను నాస్తికుడిగా ప్రకటించుకున్న భగత్‌సింగ్ పై కపట ప్రేమను కురిపిస్తోంది.
భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌ల 86వ వర్థంతి సందర్భంగా దేశభక్తిని జాతీయవాదాన్ని ఎలా అర్థం చేసుకోవాలో? భగత్‌సింగ్ పోరాటం ఇవాల్టి దేశ యువతకు ఎందుకు స్పూర్తో వివరించనున్నారు ప్రొఫెసర్ కాశీం.
కాశీం గురించి: కవి, రచయిత, ఉద్యమకారుడు సి. కాశీం వృత్తిరీత్యా అధ్యాపకుడు. 'నడుస్తున్న తెలంగాణ' మాసపత్రిక ప్రధాన సంపాదకులు. ప్రస్థుతం నిజాం కళాశాలలో తెలుగు బోధిస్తున్నారు. విప్లవ రచయితగా, కవిగా ప్రొఫెసర్ కాశీం తెలుగు సమాజంలో సుపరిచితులు. తాను రాసిన 'నేను తెలంగాణోన్ని మాట్లాడుతున్న' పుస్తకం బహుళ ప్రాచుర్యంనొందింది. మానాల, గుత్తికొండ దీర్ఘకవితలతో పాటు కాశీం కవిత్వం పేరుతో కవితా సంకలనం, సాహిత్య వ్యాసాలు, తెలంగాణ వ్యాసాలు పుస్తకాలను ప్రచురించారు.