Rhythu Bidda Telugu Classic Film
Movies
3.5 hrs
December 14, 2017 5:30 pm Thursday
image

Raithu Bidda Movie Screening & Discussion

ALL ARE WELCOME - ENTRY FREE!!! రైతుబిడ్డ - గూడవల్లి రామబ్రహ్మం …..

కొడవటిగంటి కుటుంబరావుగారు చెప్పినట్టు … కొంత జాతీయోద్యమ ప్రభావం, సాహిత్య ప్రభావం, సినిమాల ద్వారా సాంస్కృతికంగా ప్రజలకు ఏదో చేయాలనే అభిలాషా పుష్కలంగా ఉన్న దర్శకుడు. సంస్కార హృదయుడు. గూడవల్లి రామబ్రహ్మం. ప్రతిభ ఎక్కడ ఉన్నా గౌరవించేవాడు. బెజవాడ గుడివాడ మార్గంలో మానికొండ దాటగానే నందమూరు వస్తుంది. కవిసామ్రాట్టు విశ్వనాథ సత్యనారాయణగారిదీ ఆ ఊరే. గూడవల్లి రామబ్రహ్మానిదీ ఆ ఊరే. నందమూరు నుంచీ వచ్చి బెజవాడ సామారంగం చౌక్ సెంటర్ లో వ్యాపారం ప్రారంభించారు. ఆ తర్వాత ప్రజామిత్ర పత్రికతో కాలు కదిపారు. ఆయన అభ్యుదయ వాదే గానీ కమ్యునిస్టు కాదు. వారితోనూ స్నేహంగానే ఉండేవారు. కళల మీద అభిరుచి ఉండేది. సినిమాల్లోకి రాకపూర్వమే సముద్రాల రాఘవాచార్యులు లాంటి వాళ్లతో సన్నిహిత సంబంధాలుండేవి. గూడవల్లి రామబ్రహ్మం సినిమాలు తీయడం ప్రారంభించాలనుకున్నప్పుడు తెలుగు తెర మీద పౌరాణిక కథల హవా సాగుతోంది. వాటిని కాదని తొలిసారి సినిమాను అభ్యుదయ అభిప్రాయాల ప్రచారానికి వేదికగా సినిమాను వాడుకోవాలని భావించిన వాడు గూడవల్లి రామబ్రహ్మం. ఈ ఆలోచనతోనే ఆయన మాలపిల్ల తీశారు. మాలపిల్లకు మొదట రచయితగా చలం పనిచేశారు. అయితే సినిమా వాతావరణం నచ్చకపోవడం వల్ల తప్పుకున్నారు. మాలపిల్ల తర్వాత గూడవల్లి తీసిన సినిమా రైతుబిడ్డ. 1939 అగస్టు నెల్లో విడుదలైన రైతుబిడ్డ విశేషాలు ఇప్పుడు చూద్దాం. ఒక వైపు కరువు...మరో వైపు ముక్కుపిండి మరీ పన్నులు వసూలు చేస్తున్న జమీందార్లు. 1939నాటి తెలుగు రైతుల పరిస్ధితులు ఇవే. సరిగ్గా అప్పుడే జమీందారీ వ్యతిరేక రైతు ఉద్యమం ఊపందుకుంది. తిరుపతి ఎస్టేట్ తిరుత్తణి తాలూకాలో బొల్లిని మునిస్వామి నాయుడు లాంటివారు జమీన్రైతు ఉద్యమంతో ప్రజా విజయం సాధించారు. ఆ పరిస్థితులను నేపథ్యంగా తీసుకొని గూడవల్లి రామబ్రహ్మం అల్లిన కథే ‘రైతుబిడ్డ’. గూడవల్లి వారు తయారు చేసుకున్న కథకు తాపీధర్మారావు, విశ్వనాథ కవిరాజులు సహకారం అందించారు. డైలాగులు మాత్రం త్రిపురనేని గోపీచంద్ రాశారు. ఒక పెద్ద జమీ... దాన్ని పాలించే జమీందారు.... ఆయన తాబేదార్లుగా వ్యవహరించే మునసబు, కరణం... శిస్తు వసూలు లాంటి వ్యవహారాల్లో జమీలో జరుగుతున్న అన్యాయాలతో రైతులు విలవిలలాడడం... వయసులో, అనుభవంలో పెద్దవాడైన ఒక మధ్యతరగతి మంచి రైతు నర్సిరెడ్డి, అతని కుటుంబం అందరి పక్షాన గళం విప్పడం...ఇలా కథ ప్రారంభం అవుతుంది. నర్సిరెడ్డి పాత్రలో బళ్లారి రాఘవ నటించడం విశేషం. 1935 వచ్చిన ఇండియన్ యాక్ట్ ప్రకారం జరిగిన ఎన్నికల్లో ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకోమని చెప్పే ప్రబోధం కూడా సినిమాలో ఉంటుంది. ఊళ్ళో ఎన్నికల హంగామా... జమీందారు అభ్యర్థికీ, మరో యువ రైతు ఉద్యమనేత రామిరెడ్డికీ మధ్య ఎన్నికల పోటీ...ఈ పోటీ సందర్భంగా రైతుకే ఓటివ్వవలెనన్నా లాంటి పాటలు ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కూడా వినిపించాయి. జమీందారు ఎన్ని ప్రలోభాలు పెట్టినా, దౌర్జన్యాలు చేసినా ప్రజా ఉద్యమానిదే విజయం...దేశానికి స్వతంత్రం రాకపూర్వం నాటి కథ ఇది. అప్పటికీ ఇప్పటికీ రైతుల కష్టాలు ఒకే తీరున ఉండడం ఈ సినిమా చూస్తే అర్ధమౌతుంది. రైతుబిడ్డ చూస్తుంటే ఆ మధ్య వచ్చిన ఆర్.నారాయణ మూర్తి సినిమాలు గుర్తు వచ్చి తీరుతాయి. రైతుబిడ్డ విడుదలైన ఎనభై సంవత్సరాల తర్వాత కూడా పరిస్థితిలో మార్పు లేకపోవడం విషాదం. జమిందారు అభ్యర్ధికి ఓటు వేయమని రైతు నర్సిరెడ్డి మీద ఒత్తిడి తీసుకువస్తారు ఊళ్లోని పెద్దలు. నేను రైతును...రైతు ప్రతినిధిగా నిలబడ్డ రామిరెడ్డికే ఓటు వేస్తానని చెప్తాడు నర్సిరెడ్డి. దాంతో అతనిపై పగపట్టి...అప్పు తీసుకున్న సొమ్ము తక్షణం చెల్లించమని ఒత్తిడి తీసుకువస్తారు వడ్డీ వ్యాపారులు. చివరకు కూతుకు పెళ్లి చేయదలిస్తే ఆ పెళ్లి కూడా జరగకుండా చూడాలనుకుంటారు. రైతుబిడ్డ సినిమా సారధీ బ్యానర్ లో వచ్చింది. ఆ ప్రొడక్షన్ కంపెనీ చల్లపల్లి జమీందారు రామకృష్ణ ప్రసాద్ ది. ఆయన్ని ఒప్పించి రెండు సంచలనాత్మక చిత్రాలు తీశారు గూడవల్లి రామబ్రహ్మం. రంగస్థలం మీద రాజ్యం చేస్తున్న పౌరాణిక జానపద గాధల్ని సినిమాలుగా తీసేస్తున్న రోజుల్లో...సామాజిక అంశాలపై కొత్త రచయితలతో కథలు తయారు చేసి వాస్తవిక పద్దతిలో సినిమాలు తీసి సెన్సేషన్ క్రియేట్ చేశారాయన. తెలుగునాట సంఘ సంస్కరణకు నాంది పలికిన త్రిపురనేని రామస్వామి కుమారుడు రచయిత... త్రిపురనేని గోపీచంద్ రైతుబిడ్డ సినిమాకు డైలాగ్స్ రాయడంతో పాటు సహాయ దర్శకుడుగా పనిచేశారు. బసవరాజు అప్పారావు గీతాలతో పాటు కొసరాజు రాఘవయ్య చౌదరి కడగండ్లు పుస్తకంలోని రైతు గీతాలను కూడా సినిమాలో వినియోగించుకున్నారు. సినిమాల్లోకి రాకపూర్వం రామబ్రహ్మం విజయవాడలో వ్యాపారం చేశారు. మద్రాసు వెళ్లి సమదర్శిని, ప్రజామిత్ర లాంటి పత్రికలకు సారధ్యం వహించారు. అలా జాతీయ భావాలు...ప్రయోగ శీలత...సామాజిక దృక్పథం కలగలిగి మాలపిల్ల, రైతుబిడ్డ లాంటి సినిమాల రూపశిల్పిగా నిల్చారు. తను తీసే సామాజిక చిత్రాలకు ఆనాటి జాతీయ వాద రాజకీయాల నేపధ్యంలో వచ్చిన సాహిత్యాన్ని కూడా వినియోగించుకోవడం విశేషం. రైతుబిడ్డకు సంబంధించి మరో ప్రత్యేకత ఏమిటంటే..జమీందారు కోటలో రైతుల్ని బంధించే ఘట్టంలో కూచిపూడి భాగవతుల ‘దశావతార’ నృత్యాన్ని వేదాంతం రాఘవయ్య అద్భుతంగా నర్తించారు. ఆ తరువాత కాలంలో ఆయన దర్శకుడై...దేవదాసు, అనార్కలి, సువర్ణ సుందరి లాంటి సూపర్ డూపర్ హిట్స్ తీయడం విశేషం. నర్తకుడుగా వేదాంతం వారు రహస్యం చిత్రంలోనూ దర్శనమిస్తారు. అయితే రైతుబిడ్డే ఆయనకు పాపులార్టీ తెచ్చింది. రైతుబిడ్డ సినిమాకు సంబంధించి మరో విశేషం... తెలుగునాట తొలి సారి నిషేదాన్ని ఎదుర్కొన్న చిత్రం కూడా ఇదే. సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇచ్చినా, ‘రైతుబిడ్డ’ నిషేదించాలని కొందరు జమీందారులు గొడవకు దిగారు. ఈ వివాదం వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయి. గొడవకు దిగిన వారిలో చల్లపల్లి జమీందారుతో రాజకీయ విబేదాలున్న వారు కొందరైతే చిత్రంలో చూపిన జమీందారు పాత్ర తమలా ఉందనుకున్న వారు మరికొందరు ఉన్నారు. చల్లపల్లి జమీందార్, మీర్జాపురం జమీందార్ల మధ్య రాజకీయ వైరం ఉండేది. మొదట్లో ఇద్దరూ ‘జస్టిస్ పార్టీ’లోనే ఉన్నా, తర్వాత చల్లపల్లి రాజా బయటకొచ్చి, ‘ప్రజామిత్ర పక్షము’ అనే పార్టీ పెట్టుకున్నారు. ‘ప్రజామిత్ర’ పత్రికకూ అండ అయ్యారు. మీర్జాపురం జమీందారును దృష్టిలో ఉంచుకొనే ‘రైతుబిడ్డ’లోని జమీందారు పాత్రను అల్లుకున్నానే మాటా వినిపించేది. దీంతో ఆయన నిషేదం కోసం గొడవకు దిగారు. మరో వైపు రైతుబిడ్డ లో చూపించిన జమీందారు జరీ టోపీ పెట్టుకుంటాడు. వెంకటగిరి, బొబ్బిలి, పిఠాపురం జమీందార్లు కూడా జరీ టోపీలు పెట్టుకొనేవారు. అలాగే కుక్కల్ని పెంచుకుంటూ, ముద్దు చేసేవారు. ఈ సీన్లు కూడా సినిమాలో ఉన్నాయి. దీంతో తమను గురించే సినిమాలో చెడుగా చెప్పారని వారిద్దరూ వాదానికి దిగారు. రైతుబిడ్డ విడుదల విషయం రగడ సాగుతుండగానే రెండో ప్రపంచయుద్దం ముంచుకొచ్చింది. దీంతో మద్రాసు స్టేట్ లో రాజాజీ నేతృత్వంలో ఉన్న కాంగ్రెస్ సర్కార్ రాజీనామా చేసింది. అదే అదనుగా జమీందార్లు మళ్ళీ రెచ్చిపోయారు. రైతుబిడ్డ రిలీజైన ధియేటర్ల యాజమాన్యాలను బెదిరించారు. వినకపోయే సరికి...నిప్పుపెట్టే ప్రయత్నాలు కూడా చేశారు. సినిమాను మద్రాసు ప్రావిన్స్ లో నిషేదించలేదు. కేవలం కొన్ని జిల్లాల్లో మాత్రమే నిషేదించారు. నిజానికి సినిమాలో జమిందారు మంచివాడే...పక్కనున్న కొందరు దుర్మార్గులు ఆయన్ని పక్కదారి పట్టించారు లాంటి అభిప్రాయం కలిగేలా తీశారనే విమర్శా వినిపించింది. అయితే రైతుబిడ్డ ప్రభావంతోనే కావచ్చు...రామబ్రహ్మం కన్నుమూసిన తర్వాత కూడా రోజులు మారాయి లాంటి రైతు పక్షపాత సినిమా తీశారు సారధీ వారు. మాలపిల్ల, రైతుబిడ్డ చిత్రాల సంగీత దర్శకుడు భీమవరపు నరసింహారావు, పాటల రచయిత కొసరాజు కూడా ఈ సినిమాలో నటించడం విశేషం. ఎనభై సంవత్సరాల క్రితమే ఇంత అడ్వాన్స్ గా సినిమా తీశారా అనిపించేలా రైతుబిడ్డ సృజించిన గూడవల్లి రామబ్రహ్మానికి ఘనంగా నివాళులు అర్పిద్దాం. రైతుబిడ్డ చిత్రాన్ని డిసెంబరు నెల 14 సాయంత్రం ఐదు గంటలకు స్క్రీన్ చేస్తున్నాం. లామకాన్, లైకిట్ మీడియా వారి సహకారంతో ఓల్డ్ మూవీ లవర్స్ నిర్వహిస్తున్న ఈ స్క్రీనింగ్ కార్యక్రమానికి ముందు చిన్న సమావేశం ఉంటుంది.

Organizer
MOVIE VOLUME
Zeelan Basha Shaikh Bharadwaja